ఇద్దరి మహిళల దీక్ష అంతా నటనే.. : శబరిమల పరిరక్షణ సమితి

SMTV Desk 2019-01-04 13:57:27  sabarimala temple, Women entry in Sabarimala Temple, kerala, anxiety, Hindu activists, protest

కేరళ, జనవరి 4: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళ రాష్ట్రాన్ని రణరంగంగా మార్చింది. రెండు రోజుల క్రితం వేకువజామున శబరిమల అయ్యప్ప సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలు అసలు మాల ధరించలేదని, ఆలయానికి వచ్చే కొన్ని గంటల ముందు వరకు వారు మామూలు దుస్తులతోనే తిరిగారన్న వీడియో సాక్ష్యాన్ని శబరిమల పరిరక్షణ సమితి విడుదల చేసింది. డిసెంబర్ 31వ తేదీన వారిద్దరూ బస చేసిన హోటల్ లో సాధారణ దుస్తులు ధరించి వీరిద్దరూ తిరుగుతున్న దృశ్యాలను సమితి బయటపెట్టడంతో మరోసారి కేరళలో తీవ్ర కలకలం రేగింది.


మహిళలు శబరిమల అయ్యప్ప స్వామి దర్శన వివాదం ఇప్పటికే కేరళను అతలాకుతలం చేస్తుండగా, వీరిద్దరూ మాలలో ఉన్నట్టు నటించి స్వామి సన్నిధికి వచ్చారని, కనీసం నుదుటిన విభూది, కుంకుమ కూడా ధరించలేదని శబరిమల పరిరక్షణ సమితి ప్రతినిధులు మండిపడ్డారు. అయ్యప్ప ఆలయానికి వీరిద్దరూ మాలలు ధరించి, నల్ల దుస్తులతో వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే వీరిద్దరూ ఆలయ ప్రవేశం చేశారని వారు ఆరోపిస్తున్నారు. శబరిమలలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ, రెండు రోజులుగా కేరళ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో జనజీవనానికి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.