యుద్ధరంగంగా కేరళ...

SMTV Desk 2019-01-04 11:38:18  sabarimala temple, Women entry in Sabarimala Temple, kerala, anxiety, Hindu activists, protest

తిరువనంతపురం, జనవరి 4: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళ రాష్ట్రాన్ని రణరంగంగా మార్చింది. రాష్ట్రం అంతటా ఆందోళనకు దిగిన హిందూ సంస్థలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లను ఉంచి నిరసనకు దిగారు. దీంతో జనజీవనానికి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్‌ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది.

సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ), బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేనన్స్‌ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణ నేపథ్యంలో 266 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. కన్నూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. కన్నూర్‌ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేశారు.