తెదేపా పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేత

SMTV Desk 2019-01-03 19:02:23  BJP, TDP, Vishnuvardhan reddy, Chandrababu, Pawan kalyan, Janasena, Nrendramodi, Shivaji

కర్నూలు, జనవరి 3: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకు తహతహలాడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో పొత్తుకు ప్రయత్నించడం లేదని టీడీపీ నేతలు ఎవరైనా చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసేందుకే టీడీపీ నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు వివరించారు. కేంద్ర కార్యాలయం చుట్టూ తిరిగిన టీడీపీ నేతలు, బీజేపీ ప్రముఖులతో భేటీ అయిన నేతల వీడియో బండారం తన దగ్గర ఉందన్నారు. వాటిని బయటపెడ్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి రోజులు అంటూ హెచ్చరించారు.

ఈ నెల 18న అమిత్‌షా రాయలసీమలో అడుగు పెడుతున్నారని, టీడీపీ వాళ్లకు దమ్ముంటే అమిత్‌షాను అడ్డుకోండి అంటూ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నేతలు సీబీఐ, ఈడీలకు టీడీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి జరగకపోతే టీడీపీ సీబీఐ, ఐటీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. 6వ విడత జన్మభూమి పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వేల సంఖ్యలో ప్రజల అర్జీలు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేనన్ని కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ లోనే జరిగాయని దేశంలో ఏ ప్రభుత్వం చెయ్యనంత అవినీతి ఏపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ కుంభకోణం ఏపీలో జరిగిందని అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు టీడీపీ మంత్రివర్గం ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

అంతేకాకుండా హీరో శివాజీపై కూడా విష్ణువర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శివాజీ తెలుగుదేశం పార్టీ రాజకీయ దళారి అని టీడీపీ ముసుగు ధరించిన పొలిటికల్‌ బ్రోకర్‌ అంటూ ఘాటుగా విమర్శించారు. కర్నూల్ లో గురువారం మీడియాతో మాట్లాడిన విష్ణువర్థన్ రెడ్డి శివాజీపై మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ పేరుతో నానా హంగామా చేస్తున్నాడని అదంతా టీడీపీ ఆడిస్తున్న డ్రామా అంటూ కొట్టిపారేశారు. శివాజీ చెప్తున్నది ఆపరేషన్ గరుడ కాదని ఆపరేషన్ వడ అయి ఉంటుందంటూ సెటైర్లు వేశారు. శివాజీ తెలుగుదేశం పార్టీ మనిషి అంటూ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్తే మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చెయ్యడం ఆ తర్వాత మళ్లీ కనిపించకపోవడం జరుగుతుందని ఇదంతా ఓ షో అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి.