మోదీపై రాహుల్ ఆశక్తికర ట్వీట్..

SMTV Desk 2019-01-03 18:52:51  Rahul Gandhi, Narendra Modi, Rafale deal, tweet

న్యూఢిల్లీ, జనవరి 3: రఫేల్‌ వొప్పందంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంటే పారిపోయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. రఫేల్‌పై జరుగుతున్న చర్చలో పాల్గొనకుండా ప్రధాని పంజాబ్‌ పారిపోయారని గురువారం రాహుల్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో రఫేల్‌పై చర్చలో పాల్గొనకుండా ప్రధాని మోదీ వర్సిటీ విద్యార్ధులకు లెక్చర్లు ఇస్తున్నారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మోదీ గురువారం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించి అనంతరం గురుదాస్‌పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు.

అయితే ప్రధానికి తాను నిన్న సంధించిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని మోదీని కోరాలని విద్యార్ధులను రాహుల్‌ కోరడం గమనార్హం. రఫేల్‌ వొప్పందంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మోదీ సర్కార్‌పై రాహుల్‌ తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాహుల్‌ ఆరోపణలను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు.