మోడీ కళ్లుండి గుడ్డివారు : తెదేపా ఎమ్మెల్సీ

SMTV Desk 2019-01-03 17:24:34  Budda venkanna, TDP, MLC, BJP, Narendra modi

విజయవాడ, జనవరి 3: నగరంలోని తెదేపా కర్యలంలో పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ ఏపీ పర్యటనను రద్దు చేసుకోవడం పై స్పందించారు. రాష్ట్ర ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు సభను రద్దు చేసుకున్నారని ఏపీకి రాలేక బీజేపీలో ఉన్న లోఫర్లు, డాఫర్లు,చీటర్లు, గజదొంగలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని వెంకన్న ఎద్దేవా చేశారు. అదే కాన్ఫరెన్స్‌లో బీజేపీ నేతలు మాట్లాడిన భాషను తప్పుబట్టకుండా మోడీ పత్రికలకు లీక్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ కళ్లుండి గుడ్డివారిలా ప్రవర్తిస్తున్నారని అందుకు నిదర్శనగానే తాను కళ్లకు గంతలు కట్టుకుని మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో వందల కోట్లు దోచుకున్న కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు.







సోము వీర్రాజు కౌన్సిలర్, ఎంపీగా పోటీ చేసి పట్టుమని 6 వేల ఓట్లు సాధించలేని వ్యక్తని అలాంటి వ్యక్తి ప్రధానమంత్రిని డైరెక్ట్‌ చేస్తారా అని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీలో ఉన్న మొత్తం నాయకులు వొక గ్రామంలో ఉన్న టీడీపీ నాయకులంత మంది ఉండరని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ దయవల్ల బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా లబ్ధి పొందారని బుద్ధా గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధి ఇతర కార్యక్రమాలను గాలికొదిలేసి కేవలం చంద్రబాబును టార్గెట్ చేయడమే ప్రధాని పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. పోలవరానికి ఎటువంటి సాయం చేయకపోయినా ప్రాజెక్ట్ పనులు ఆగడం లేదన్నారు.

తెలంగాణలో మహాకూటమికి 21 సీట్లు వస్తే బీజేపీకి కేవలం వొకే వొక్క సీటు దక్కిందని, 103 స్థానాల్లో డిపాజిట్లు రాలేదని వెంకన్న ఫైర్ అయ్యారు. కేసీఆర్ ద్వారా తెలుగువారి మీదకు తెలుగువారిని ఊసిగొల్పి నరేంద్రమోడీ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనికి రారని పగలు బీజేపీ ముసుగులో రాత్రి విజయసాయిరెడ్డితో మీటింగులు పెడతారని వెంకన్న ఆరోపించారు. సోము వీర్రాజు 50 లక్షలకు బీజేపీ టిక్కెట్‌ను అమ్ముకున్నారన్నారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్‌ని నమ్మాలా రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబును నమ్మాలా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.