మోదీకి ఆ దమ్ము లేదు : రాహుల్

SMTV Desk 2019-01-03 16:00:56  Rahul Gandhi, ANI news agency, Interviews, Narendra Modi

న్యూఢిల్లీ, జనవరి 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మీ ముందుకు వచ్చి కూర్చునే దమ్ము లేదు, అందుకే నేను వచ్చాను. ప్రతి వారం రోజులకోసారి వస్తాను. మీరు నన్ను ఏ ప్రశ్నయినా అడగవచ్చు. ప్రధాన మంత్రి మోదీ ఇంటర్వ్యూ చూశారు గదా! ఓ సానుకూల జర్నలిస్ట్‌ మోదీని ఓ పక్క ప్రశ్న అడుగుతూ మరో పక్క ఆమే సమాధానం ఇస్తోంది అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం నాడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని జనవరి 1వ తేదీన ఏషియన్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌(ఏఎన్‌ఐ) వార్తా సంస్థ ఎడిటర్‌ స్మితా ప్రకాష్‌ చేసిన ఇంటర్వ్యూ గురించి రాహుల్‌ ప్రస్తావిస్తూ స్మితా ప్రకాష్‌ను ఉద్దేశించి ‘సానుకూల జర్నలిస్ట్‌ అని విమర్శించారు.

ఇంతకుముందు ప్రధాని మోదీని అర్నాబ్‌ గోసామి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అయన మోదీని ఎలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయలేదు. పైగా తాను అడగదల్చుకున్న ప్రశ్నలను ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి ముందే పంపించారు. వాటికి పీఎంవో కార్యాలయం కూడా కొన్ని ప్రశ్నలను జోడించింది. అదే అర్నాబ్‌ గోసామి నాలుగేళ్ల క్రితం రాహుల్‌ గాంధీని ఇంటర్వ్యూతో ముచ్చెమటలు పోయించారు. ఆ ఇంటర్వ్యూ ద్వారానే రాహుల్‌ గాంధీకి ‘పప్పూ అనే పేరు వచ్చింది. కాగా అంతకముందు ‘డెవిల్స్‌ అడ్వకేట్‌ కార్యక్రమంలో నరేంద్ర మోదీని జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌ 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల గురించి గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టారు. దాంతో నరేంద్ర మోదీ కార్యక్రమం మధ్యలోనే మైక్‌ను విసిరేసి బయటకు వెళ్లి పోయారు.

బీజేపీ అనుసరిస్తున్న మెజారిటీవాద దృక్పథానికి తమ పార్టీ దూరమని, ఆ పార్టీ పాలనలో మీడియా స్వేచ్ఛ హరించుకు పోయిందని గతంలో పలుసార్లు విరుచుకుపడిన రాహుల్‌ గాంధీ నుంచి ఈ సానుకూల జర్నలిస్ట్‌ అన్న విమర్శ వస్తుందని ఊహించలేదు. మీడియా తప్పొప్పులను ప్రశ్నించాల్సిందే! అయితే అది ఎవరు చేయాలి? మీడియా సంస్థలు, మీడియా కమిటీలు లేదా ప్రజలు చేయాలి. రాజకీయ నాయకులు మాత్రం కాదు, కాకూడదు! ఈ వ్యవస్థ మంచి, చెడులకు వారే బాధ్యులవుతున్నందున వారు చేయడం సబబు కాదు. చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీలు మీడియాను నిలదీయవచ్చు. విమర్శంచవచ్చు!