టీడీపీ ఎంపీలు సస్పెండ్...!!!

SMTV Desk 2019-01-03 14:08:28  Parliment, TDP, MLA, Suspension, Sumitra mahajan, Thota narashimham, Ram mohan naidu, Galla jayadev, Murali mohan, Butta renuka, Avati srinivas, Konakalla narayana, Pusapati ashok gajapati raju, Maganti babu, JC Divakar reddy, Sriram malyadrilu

న్యూ ఢిల్లీ, జనవరి 3: పార్లమెంట్ లో గత కొద్ది రోజులుగా రాఫెల్ డీల్ వంటి అంశాలపై వాడీ వేడిగా చర్చలు సాగుతున్నాయి. దీంతో పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలితంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా మారాయి. తాజాగా పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్విభన చట్టంలోని హామీల అమలుపై డిమాండ్ చేశారు. సభలో బిగ్గరగా అరుస్తూ టీడీపీ ఎంపీలు నిరసన చెయ్యడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెన్షన్ వేటు వేశారు. కాకినాడ ఎంపీ తోట నర్సింహం, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనకాపల్లి ఎంపీ అవతి శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, పూసపాటి అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రిలు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

ఎంపీలను నాలుగు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభాకార్యక్రమాలకు టీడీపీ ఎంపీలు పదేపదే అడ్డు తగులుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ 374 ఏ నిబంధన ప్రకారం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అనంతరం సభను మద్యాహ్నాం 2 గంటలకు వాయిదా పడింది. తమపై సస్పెన్షన్ వేటు పడటంతో టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తీరును నిరసిస్తూ ఎంపీలు లోక్ సభ వెల్ లో నిరసనకు దిగారు. భోజన విరామ సమయంలో కూడా సభ్యులు బయటకు వెళ్లకుండా వెల్ లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాలుగు రోజులపాటు సస్పెన్షన్ వేటు వెయ్యడంతో ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకావం లేకుండా పోయింది.