మోడీ హయంలో 6 వేల కోట్ల ప్రాజెక్ట్లు 90 వేల కోట్లకు చేరాయి : తెదేపా ఎమ్మెల్యే

SMTV Desk 2019-01-03 13:05:18  TDP, MLA, Devineni uma maheshwar rao, BJP, Narendra modi

అమరావతి, జనవరి 3: తెదేప ఎమ్మెల్యే దేవినేని ఉమ మహేశ్వర్ రావు భారత ప్రధాని పై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నీతిఅయోగ్ వైస్ ఛైర్మన్ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షించేందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనులను చేపడుతుందని ఆయన ప్రశంసించారని తెలిపారు. పోలవరం పనులను చంద్రబాబు పరుగులు పెట్టిస్తుంటే ప్రధాని కాగ్ నివేదికను పట్టుకుని ప్రశ్నలు సంధిస్తున్నారని దేవినేని తెలిపారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌ను రూ.6 వేల కోట్లతో మొదలుపెట్టారని, పన్నెండున్నర సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేకపోయారని ప్రధాని అయిన నాలుగేళ్లకు ఆ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు.

మోడీ ప్రధాని అయిన తర్వాత 6 వేల కోట్ల ప్రాజెక్ట్ 90 వేల కోట్లకు చేరిందని, త్వరలోనే లక్ష కోట్లు చేరుతుందని అంచనా అని ఉమా అన్నారు. గుజరాత్‌కు వొక న్యాయం, ఆంధ్రప్రదేశ్‌కు వొక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించాల్సిందిగా విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంటే డీపీఆర్‌కి ప్రధాన మంత్రి కార్యాలయం అడ్డుపడుతోందని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్‌లు కాకపోయినప్పటికి లాలూచీ రాజకీయాల కారణంగా అనుమతులు మంజూరు చేస్తారని, నాణ్యతా ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు పోలవరానికి జాతీయ అవార్డులు ఇస్తుంటే.. ప్రధాని హోదాలో వొక్కసారి కూడా పోలవరానికి రాలేదని దేవినేని మండిపడ్డారు. ఏపీపైనా, చంద్రబాబుపైనా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ అధిష్టానం ఏమాత్రం ఖండించడం లేదని దేవినేని వ్యాఖ్యానించారు.