ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తే ఆ కిక్కే వేరప్పా : చంద్రబాబు

SMTV Desk 2019-01-03 11:21:54  Chandrababu, Janmabhoomi, IAS Officers, Tele confirance

అమరావతి, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి తొలిరోజే అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ప్రజలు జన్మభూమి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారనీ, వారిలో పెరిగిన చైతన్యానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల్లో పాల్గొనే ఫిర్యాదుదారుల్లో బాధ ఉంటుందనీ, నేతలు, అధికారులు దీన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని అన్నారు. అమరావతిలో ఈరోజు ‘జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై కలెక్టర్లు, అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రజల సమస్యలు విని వాటిని శరవేగంగా పరిష్కరిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుందని సీఎం తెలిపారు. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉపాధి హమీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. దీన్ని అధికారులు, నేతలు గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. చుక్కల భూమి సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తొలిరోజు 18,527 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రభుత్వానికి అందే ఫిర్యాదుల్లో వీలైనంత ఎక్కువవాటిని ఈ 10 రోజుల్లోనే పరిష్కరించాలని ఆదేశించారు.