చైనాలో తగ్గుతూ వస్తున్న జనాభ

SMTV Desk 2019-01-02 20:59:23  Chaina, Two childs, Birth rate, Death rate

బీజింగ్, జనవరి 2: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. ఈ దేశంలో మరోసారి ఇద్దరు పిల్లల విధానం విఫలమైంది. 2018లోనూ ఆ దేశంలో శిశు జననాల రేటు పడిపోయింది. 2017లో కంటే 2018లో శిశు జననాలు దాదాపు 2 మిలియన్లు తక్కువగా నమోదయ్యాయి. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, యువకుల సంఖ్య భారీగా పడిపోవడంతో 2016 నుంచి చైనా తమ వొకే బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు అనే విధానానికి ముగింపు పలికి, ఇద్దరు బిడ్డల విధానానికి నాంది పలికిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ విధానం కూడా శిశు జననాల రేటు పెంచడంలో విఫలమవుతోంది. ఆ దేశంలో 2016 చివరి నాటికి 230.8 మిలియన్ల (23.08 కోట్లు) మంది 60 ఏళ్లు దాటిన వారే ఉన్నారు.

శిశు జననాల విషయంలో ఆ దేశం ఇప్పటివరకు అధికారికంగా వివరాలు వెల్లడించనప్పటికీ, స్థానిక ఆరోగ్య శాఖలు వెల్లడించిన వివరాల ప్రకారం చైనాలో మరోసారి ఈ రేటు పడిపోయిందని తేలింది. 2017లో కంటే 2018లో దాదాపు 15 శాతం పడిపోయింది. 2017లో శిశు జననాలు 17.23 మిలియన్లుగా ఉంది. అప్పటి కంటే గత ఏడాది 2 మిలియన్లు తక్కువగా నమోదైంది అని జనాభా అధ్యయన శాస్త్రవేత్త హె యఫూ మీడియాకు తెలిపారు. ఈ సారి కూడా ఈ విషయంలో ఆరోగ్య శాఖ అధికారుల అంచనాలు చైనా అందుకోలేదని ఆ దేశ నిపుణులు తెలిపారు.

చైనా ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేసిన నేపథ్యంలో 2017, 2018ల్లో శిశు జననాల రేటు వరసగా 1.97, 2.09గా ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేశారు. 2017 కన్నా 2018లో 7.90 లక్షల మంది శిశువులు అధికంగా పుడతారని అనుకున్నారు. అయితే, ఆ అంచనాలను అందుకోలేకపోయారు. దశాబ్దం తరువాత చైనాలో 20 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న మహిళల జనాభా తగ్గనుందని మందే ఉంటారని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. అధిక సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తూ సరైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చైనా జనాభా విపరీతంగా తగ్గుతుందని అన్నారు.