చంద్రబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైసీపీ

SMTV Desk 2019-01-02 19:29:49  AP, CM, Chandrababu, YSRCP, YS Jaganmohan reddy, Janasena party, Pawan kalyan

అమరావతి, జనవరి 2: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేనతో పొత్తుపై వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. తమను టార్గెట్ చేస్తూ నేరుగా చంద్రబాబు వ్యాఖ్యలు చెయ్యడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఎప్పుడు విడిపోయారంటూ ప్రశ్నించింది. బాబు-పవన్ వొకప్పుడు బహిరంగ మిత్రులు అని ఇప్పుడు రహస్య మిత్రులు అంటూ సెటైర్లు వేసింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్య లింగమనేని ఓ జాయింట్ బాక్స్ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. లింగమనేని ఇంట్లో ఉంటూ చంద్రబాబు ఆయన భూములు ల్యాండ్ ఫూలింగ్ కు గురవ్వకుండా చూశారంటూ ఆరోపించింది. అదే లింగమనేని ఎకరా నాలుగున్నర కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం రూ.30 లక్షలకే ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది.

పవన్ కళ్యాణ్ , చంద్రబాబులకు మధ్య జాయింట్ బాక్స్ లాంటి వారు లింగమనేని అంటూ వైసీపీ విమర్శించింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసినా లేక ఇతరులతో కలిసినా కలవకపోయినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని వైసీపీ స్పష్టం చేసింది. చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేకనే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించింది. నాలుగున్నరేళ్లలో అభివృద్ధి చేసి ఉంటే పక్క రాష్ట్రంలో కేసీఆర్ లా ముందస్తు ఎన్నికలకు వెళ్లేవారని ధ్వజమెత్తింది. నిన్న మెున్నటి వరకు తిట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ వొక్కటే అనడానికి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. చంద్రబాబులా తాము పొత్తులను నమ్ముకోలేదని, ప్రజలను నమ్ముకున్నామని అందుకే తాము ధైర్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది వైసీపీ.