మరిన్ని అందాల్ని ఆరబోయనున్న చార్మినార్...!!!

SMTV Desk 2019-01-02 18:49:58  Hyderabad, GHMC, Charminar, Arvind kumar

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్ నగరానికి గుర్తుగా ఆకర్షనీయంగా మారిన పురాతన కట్టడం చార్మినార్ అందాలకు మరింత మెరుగులు దిద్దాలని సంబంధిత అదికారులకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. చార్మినార్ తో పాటు దాని చుట్టున్న పరిసరాలను కూడా పర్యాటకులకు ఆహ్లాదం కల్గించేలా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అంతేకాకుండా పాత నగరంలోని వివిధ పురాతన కట్టడాల వద్ద కూడా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అదికారులకు ఆదేశించారు.

ఇవాళ చార్మినార్ తో పాటు పాత నగరంలోని వివిధ పురాతన కట్టడాలను అర్వింద్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాకుండా రాత్రివేళల్లో చార్మినార్ వద్ద మంచి లైటింగ్ వ్యవస్ధను ఏర్పాటు చేసి ఈ పురాతన కట్టడం అందాలను రెట్టింపు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. అర్వింద్ కుమార్ చార్మినార్ పరిసరాలతో పాటు పాతనగరంలో శాలిబండ, హిమ్మత్ పుర, అబ్దుల్లా బిల్డింగ్, ముర్గిచౌక్, సిటీకాలేజ్, నయాపూల్ ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రాంతాల్లో వున్న వరద నీటి కాలువల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వాటి మరమ్మతుల కోసం చేపడుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ శాలిబండ ప్రాంతంలో నిజాం పరిపాలన సమయంలో ఏర్పాటుచేసిన వరద నీటి కాలువలు ఇప్పటికి సమర్ధంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఆనాటి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో ఈ డ్రైన్లను పకడ్బందీగా, అత్యంత నాణ్యతతో నిర్మించారని వివరించారు. నయాపూల్ పరిసరాల్లో వారం రోజుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ ను ఆయన ఆదేశించారు. అలాగే ఆర్చ్ బ్రిడ్జిపై లైటింగ్, ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని అర్వింద్ కుమార్ ఆదేశించారు.