హై కోర్ట్ విభజనకు నిరసన వ్యక్తం చేసిన రాయలసీమ

SMTV Desk 2019-01-02 17:48:23  High court, Andhrapradesh, Amaravati, Rayalaseema, Cuddapa

కడప, జనవరి 2: ఉమ్మడి హై కోర్ట్ విభజన అనంతరం ఏపీలో కొంత మంది హర్షం వ్యక్తం చేస్తుంటే, మరి కొంత మంది దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. రాయలసీమలో హక్కులను హరించే విధంగా రాజధానితో పాటు హైకోర్టును సైతం అమరావతిలోనే ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అక్కడి న్యాయవాదులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు ముందు విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నేతలు మంగళవారం ఆందోళనకు దిగారు.

రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్ వొప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం ఆ వొప్పందానికి సమాధి కట్టడమేనని వారు మండిపడ్డారు. ప్రభుత్వ చర్య సీమ ప్రజల ఆకాంక్షలను హేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా ఉందని దుయ్యబట్టారు. గతంలో హైదరాబాద్‌లో వలె ప్రస్తుతం అమరావతి చుట్టుపక్కల అభివృద్ధిని కేంద్రీకరీస్తున్నారని రాజధాని సహా విద్య, వైద్య, పరిశోధన సంస్థలు నెలకొల్పుతున్నారన్నారు. చివరికి రాయలసీమ ప్రజల చిరకాలవాంఛ అయిన హైకోర్టును సైతం అక్కడే ఏర్పాటు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.