పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్దం...

SMTV Desk 2019-01-02 15:19:52  Telangana panchayati elections, Notifications, Sarpanch

హైదరాబాద్, జనవరి 2: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి విడుదల చేశారు. ఈ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతున్నాయి. సర్పంచ్‌ పదవికి నేరుగా ఎన్నికలు నిర్వహిస్తూ ఉప సర్పంచ్‌ ఎన్నికలు ఎన్నికైన వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికలు మూడు విడుతలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని, అధికారిక సమావేశాలు, సమీక్షలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు మొత్తం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. బ్యాలెట్‌ పద్దతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు అర్హతలు, ఖర్చు, అర్హత తదితర అంశాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,732 గ్రామపంచాయితీలలో 1,13,370 వార్డులకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ గ్రామాలకు మూడు విడుదతలుగా ఎన్నికలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. తొలి విడత ఎన్నికలకు జనవరి 7న నోటిఫికేషన్‌ 21న తేదిన పోలింగ్‌, రెండో విడత 11న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 25న పోలింగ్‌ ఉండనుంది. చివరగా మూడవ విడత 16న నోటిఫికేషన్‌ 30న పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 12,732 గ్రామపంచాయితీలలో 1,13,190 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా 1,49,52,058 ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారని ఆయన తెలిపారు.

గత యేడాది ఎన్నికలు నిర్వహిస్తామన్న ఆలోచనతో మే నెలలో ఓటరు జాబితాను సిద్దం చేసి వాటి వివరాలను గుర్తింపు పొందిన పార్టీలకు అందించినట్లు ఆయన తెలిపారు. గత యేడాది మే 17 విడుదల చేసిన జాబితా ప్రకారం 1,32,17,429 మంది ఓటర్లు ఉండగా, నవంబరు 19న సప్లిమెంట్‌ విడుదల చేసినట్లు తెలిపారు. 16లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును కొత్తగా వచ్చారని తెలిపారు. 4,52,093 మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. లక్షన్నర మంది సిబ్బంది పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారు. ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తి మాత్రమే పోటీ చేయడానికి అర్హుడని స్పష్టం చేశారు. అయితే ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేయడానికి అర్హుడని, ఓటు ఉండి ఎపిక్‌ కార్డు లేకపోతే 18 రకాల గుర్తింపు కార్డు ద్వారా ఓటును వినియోగించుకోవచ్చునన్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎన్నికైన వార్డు సభ్యులు అదే ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పుడు షెడ్యూల్‌ విడదల చేసినట్లు, షెడ్యూల్‌ తేదీలకు అనుగుణంగా స్థానికంగా ఉండే ఆర్‌ఓలు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇస్తారని తెలిపారు. వొక్కొక్క వార్డులలో గరిష్టంగా 600 ఓటర్లు ఉంటారని, కనిష్టంగా 200 మంది ఓటర్లు ఉండనున్నారు. మొత్తం 1.13.190 పోలింగ్‌ బూతులను ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే మైక్‌లను ద్వారా ప్రచారం నిర్వహించుకోవాలని, నిబంధనలకు విరుద్దంగా సాయంత్రం సమయాల్లో మైక్‌ల ద్వారా ఇబ్బంది పెడితే కేసులు నమోదు ఉంటుందన్నారు.

కాగా నగదు పంపిణీ విషయంలో అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేయకూడదని, ఎన్నికలకు సంబంధం లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చునని, ఎన్నికలకు సంబంధించిన లావాదేవీలు ఉంటే వాటిపై కేసులు నమోదు చేస్తామన్నారు. సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తి గ్రామపరిధిలో వార్డు మెంబరుగా పోటీ చేసే వారు తమ వార్డులో ఖచ్చితంగా ఓటరుగా నమోదు అయి ఉండాలి. వొక అభ్యర్థి వొక వార్డుకు మించి పోటీ చేయరాదు. తెలుగు అక్షర క్రమంలో ఎన్నికల గుర్తులు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారు. అభ్యర్థుల జాబితాలో తెలుగు అక్షరమాల ప్రకారం మొదటి వ్యక్తి ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన మొదటి గుర్తు కేటాయిస్తారు. రెండో అభ్యర్థికి రెండో గుర్తు అదే విధంగా మిగిలిన గుర్తులు కేటాయిస్తారు. వొకవేళ ఇద్దరి పేర్లు వొకటే ఉంటే నామినేషన్‌ సంఖ్య ఆధారంగా గుర్తులు కేటాయిస్తారు. పోలింగ్‌ ముగిసే సమయానికి 44గంటల ముందే ప్రచారం నిలిపివేయాలి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన రోజు నుంచి మూడు రోజుల మద్య నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది, నామినేషన్ల చివరి రోజే పరిశీలన ఉంటుందని, మరుసటి రోజు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకోవచ్చునని, అయితే వాటిని అదేరోజు పరిష్కరిస్తారని వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ఉన్నన్ని రోజులు సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిషేదం. ప్రచారానికి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు వినియోగించడం, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థన స్థలాలను వాడుకోవడం నేరం, నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమాన విధిస్తారు.

ఓటింగ్‌ రోజే కౌంటింగ్‌ :

పంచాయితీ ఎన్నికలు మూడువిడతలుగా జరగనున్నాయని, ఎన్నికలు నిర్వహించిన రోజే కౌంటింగ్‌ కూడా అదే నిర్వహించనున్నారు. మూడువిడతలలో 21, 25, 30 తేదీలలో ఎన్నికలు ఉంటాయని, అదే రోజు కౌంటింగ్‌ కూడా ఉంటుందన్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 1గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఆయన వెల్లడించారు. పోలింగ్‌ జరిగిన రోజు ఓట్ల లెక్కింపును పూర్తి చేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. 2గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని, మొదట వార్డు మెంబర్లు కౌంటింగ్‌ తరువాత, సర్పంచ్‌లకు సంబంధించిన కౌంటింగ్‌ తరువాత ఉంటుందన్నారు. అదే రోజు ఉపసర్పంచ్‌ ఎన్నిక కూడా ఉంటుందన్నారు.

బ్యాలెట్‌ పేపర్లు :

కాగా పంచాయితీ ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మూడున్నర కోట్ల బ్యాలెట్‌ పేపర్లను ముద్రించినట్లు, ఇందులో సగం సర్పంచ్‌లు, మిగిలిన వార్డు సభ్యులు కోసం కేటాయించినట్లు తెలిపారు. మొత్తం బ్యాలెట్‌ పేపర్లలో వొకే రకమైన గుర్తులు ఉంటాయని వెల్లడించారు. అన్ని గ్రామాల్లో వొకే విధంగా బ్యాలెట్‌ పేపరు, గుర్తులు వొకే విధంగా ఉంటాయని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ పేపరుపై పేరు ఉండదని తెలుపురంగు, పింక్‌ రంగులతో బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయన్నారు.

నోటా :

పంచాయితీ ఎన్నికల్లో ఈ సారి నోటా గుర్తును ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అభ్యర్థులు నచ్చకపోతే నోటాను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌లో చివరలో నోటా గుర్తు ముద్రించినట్లు తెలిపారు.

మూడవిడతలుగా :

పంచాయితీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. జనవరి 21, 25, 30 తేదీలలో పోలింగ్‌ జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆర్‌ఓలు విడుదల చేస్తారన్నారు. తొలి విడత ఎన్నికలకు జనవరి 7న నోటిఫికేషన్‌ 21న తేదిన పోలింగ్‌, రెండో విడత 11న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 25న పోలింగ్‌ ఉండనుంది. చివరగా మూడవ విడత 16న నోటిఫికేషన్‌ 30న పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొదటి విడత 4480 గ్రామాలలో 39,832 వార్డులు, రెండో విడత 4137 గ్రామాలలో 36680 వార్డులు, మూడవ విడతలో 4115 గ్రామాలు 36718 వార్డులలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.

ఖర్చు :

ఎన్నికల ఖర్చుకు పరిమితి విధించినట్లు నాగిరెడ్డి స్పష్టం చేశారు. 5000 జనాభా దాటిన పంచాయితీలు అయితే సర్పంచ్‌ అభ్యర్థులు రూ.2,50,000 మించి ఖర్చు చేయరాదని, 5000ల కంటే తక్కువ ఉన్న గ్రామపంచాయితీలలో రూ.1,50,000 నిర్ణయించినట్లు తెలిపారు. వార్డు సభ్యులు వ్యయానికి సంబంధించి ఐదు వేల జనాభా దాటిన పంచాయితీలు అయితే రూ.50వేలు, ఐదు వేల కంటే తక్కువ ఉంటే రూ.30వేల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. పరిమితికి మించి ఖర్చు చేస్తే పదవి కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఫీజు :

పంచాయితీలలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సంబంధించిన ఫీజులను వెల్లడించారు. సర్పంచ్‌లుగా పోటీ చేసిన అభ్యర్థులు జనరల్‌ రూ.2000, రిజర్వ్‌ కేటగిరి ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులు అయితే రూ.1000, వార్డు సభ్యులు సభ్యులు జనరల్‌ అయితే రూ.500, రిజర్వ్‌ ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

19 గ్రామాలకు ఎన్నికలు జరగడంలేదు :

రాష్ట్రంలో 19 గ్రామాలకు ఎన్నికలు జరగడం లేదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. 15 గ్రామాలకు పంచాయితీల పదవి కాలం పూర్తికాలేదని స్పష్టం చేశారు. మరో రెండు గ్రామాలకు న్యాయస్థానంలో ఉండడంతో ఎన్నికలు జరగం లేదన్నారు. రంగారెడ్డి, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రెండు చోప్పున గ్రామాలకు, మంచిర్యాలలలో మూడు గ్రామాలు, నల్గొండలలో ఎక్కువగా ఏడు గ్రామాలకు ఇంకా సమయం ఉందని, మహబుబాబాద్‌, రాజన్న సిరిసిల్లా జిల్లాలో వొక్కోక్క గ్రామాలు కోర్టుల్లో కేసులు ఉన్నాయి.

మొదటి విడత రెండో విడత మూడవ విడత

నోటీసు జనవరి 7 జనవరి 11 జనవరి 16
నామినేషన్ల స్వీకరణ జనవరి 7 నుంచి 9 జనవరి 11 నుంచి 13 జనవరి 16 నుంచి 18
నామినేషన్ల పరిశీలన జనవరి 10 జనవరి 14 జనవరి 19
ఆర్‌డిఓకి అప్పీల్‌ జనవరి 11 జనవరి 15 జనవరి 20
అప్పీల్‌ పరిష్కారం జనవరి 12 జనవరి 16 జనవరి 21
నామినేషన్ల ఉపసంహరణ జనవరి 13 జనవరి 17 జనవరి 22
పోలింగ్‌, ఓట్ల లెక్కింపు జనవరి 21 జనవరి 25 జనవరి 30