రాష్ట్రంలో పలు చోట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం

SMTV Desk 2019-01-02 13:57:02  Telangana, Solar power palnt, Coal mines, Power plants, South eastern solar energy corporation of india, Mandamarri, Ramagundam, Bellampally, Bhupal pally

హైదరాబాద్, జనవరి 2: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే పలు ప్రాంతాల్లో తొమ్మిది సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, విద్యుత్‌ అవసరాలకు ఉపయోగపడే విధంగా 1,360 కోట్ల రూపాయలతో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ యాజమాన్యం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో మరో 10 నెలల్లో ఈ సోలార్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. మొదటి దశలో తొమ్మిది చోట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి తద్వారా 300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు సోలార్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ సౌత్‌ ఈస్టర్న్‌ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఇప్పటికే సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపి ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు అధికావర్గాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలోని కొత్తగూడెం, ఇల్లెందు, మందమర్రి, రామగుండం, మణుగూరు, బెల్లంపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సాధారణంగా 30 నుండి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవి కాలంలో 45 నుండి 49 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని పవర్‌ ప్లాంట్‌ల నిర్మాణానికి వొకసారి వ్యయం చేస్తే కొన్నేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు చేయాల్సిన అవసరం ఉండదని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది.

అంతేకాకుండా తక్కువ మ్యాన్‌ పవర్‌తో విద్యుత్‌ ఉత్పత్తికి వీలు కలుగుతుందంటున్నారు. వివిధ రకాల సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని ఇల్లెందులో 60 మెగావాట్లు, మందమర్రిలో 60 మెగావాట్లు, రామగుండం-1లో 30 మెగావాట్లు, కొత్తగూడెంలో 25 మెగావాట్లు, భూపాలపల్లిలో 10 మెగావాట్లు, సింగరేణి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్స్‌లో 10 మెగావాట్లకు సంబంధించి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ఫ్రీ బిల్డింగ్‌, టెండర్లు, టెక్నికల్‌ అవకాశాలు తదితర వాటిని పూర్తి చేస్తోంది. ఇప్పటికే సింగరేణి సంస్థ ధర్మల్‌ విద్యుత్‌ను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఉత్పత్తి చేస్తోంది. ఈ తొమ్మిది సోలార్‌ పవర్‌ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదని అధికారవర్గాలు చెబుతున్నాయి.