ఏపీ హై కోర్ట్ ప్రారంభ దశలోనే జగన్ కి షాక్...!!!

SMTV Desk 2019-01-02 12:31:39  AP, High court, Jagan mohan reddy, YSRCP, Nampally high court, Petition, Governor, Narashimhan

అమరావతి, జనవరి 2: ఉమ్మడి హై కోర్ట్ విభజన అనంతరం ఏపీ హై కోర్ట్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే విధులు మొదలు పెట్టిన కొన్ని గంటల్లోనే వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులు నాంపల్లి నుండి ఏపీ హైకోర్టుకు బదిలీ చెయ్యాలంటూ పిటీషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి వొకటిన మంగళవారం గవర్నర్ నరసింహన్ న్యాయవాదులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎంతో అట్టహాసంగా హైకోర్టును ప్రారంభించారు.

అయితే బుధవారం ఉదయం నుంచే ఏపీ హైకోర్టులో విధులు ప్రారంభమయ్యాయి. వొక్కో జడ్జికి 25 కేసులను కేటయించారు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేసులను ఏపీ హైకోర్టుకు బదిలీ చెయ్యాలంటూ పిటీషన్ దాఖలైంది. మరోవైపు హైకోర్టు విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన వల్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కోర్టు కేసుల నుంచి తాత్కాలిక ఊరట లభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజన నోటిఫికేషన్‌పై మీడియాతో మాట్లాడారు. జగన్ కేసులన్నీ ఇప్పుడు లాజిక్‌గా వస్తున్నాయని హైకోర్టు విభజన తర్వాత కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి బదిలీ అవుతారని, ట్రయల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసు మళ్లీ మొదటికి వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ కేసులపై పిటీషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.