9వ శ్వేతపత్రం విడుదల : సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-12-31 18:08:11  CM Chandra Babu Naidu, 9 va shwethapartam,amravati,industies,IT,development,Amaravati

అమరావతి: అమరావతి ప్రజావేదికలో ఆయన పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి వొకటి చొప్పున చిన్న, మధ్యతరహా పరిశ్రమ పార్కులు ఏర్పాటు చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. నాలుగున్నరేళ్ల కాలంలో రూ.82,097 కోట్ల రుణాలను ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చామని చెప్పారు. 12శాతం వృద్ధి రావాలని లక్ష్యంగా పెట్టుకుంటే 10.5శాతం వృద్ధి సాధించామని వెల్లడించారు. విభజన లాంటి చారిత్రక కారణాల వల్ల ఏపీలో పారిశ్రామిక రంగం, సేవలరంగం ఇంకా వెనుకంజలో ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఈరంగాల్లో కూడా మెరుగైన అభివృద్ధి సాధించే వారమని ఆయన అన్నారు. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, ఐటీ కారిడార్‌ ఇలా అన్నిట్లోనూ కేంద్రం నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. అందుకే రాష్ట్రమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం పెంపులో కీలకమైన పరిశ్రమల రంగాన్ని వృద్ధి చేసేందుకు పది కీలకమైన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామన్నారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
ఖాయిలా పడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.100కోట్లు కేటాయించినట్టు సీఎం వివరించారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల కారణంగా కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. తిరుపతి మొబైల్ హబ్ గా తయారవుతోందని సీఎం తెలిపారు. విశాఖను ఐటీ కారిడార్ గా తీర్చిదిద్దుతున్నట్టు స్పష్టం చేశారు.