​మంత్రి వర్గం లో మార్పులుంటాయి : సీఎం కెసిఆర్

SMTV Desk 2018-12-29 12:23:24  TRS, Telangana state government, KCR, CM, Ministers, New delhi

హైదరాబాద్, డిసెంబర్ 29: శుక్రవారం న్యూ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు విందునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని అందుకనుగుణంగా కొత్త మంత్రివర్గం కూర్పు ఉంటుందన్నారు. పార్టీకి నష్టం కలిగించిన వారిపై వేటుకు వెనుకాడబోమని, కొందరు ఛైర్మన్లకు ఉద్వాసన ఉంటుందని చెప్పారు.

అంతేకాక మంత్రివర్గం, పాలన, ఇతర అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయని మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదు అని హెచ్చరించారని సమాచారం. అధికారులు, సిబ్బంది అలసత్వాన్ని సహించేది లేదని శాఖల వారిగా ప్రగతి కనిపించాలి అని అన్నారు. 64 ఏళ్ల వయసులో నేను ఎందుకు కష్టపడుతున్నాను? ఈ చలిలో ఎందుకు తిరుగుతున్నాను? తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతిని కాంక్షిస్తూ పర్యటిస్తున్నానే తప్ప నాకేమీ స్వార్థం లేదు. అందరిలోనూ ఇలాంటి ఆలోచనలు రావాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు కృషి చేయాలి. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీ సమస్యలన్నీ తొలగిపోయేందుకు కృషి చేస్తున్నాం. ఎంపీలుగా మీరంతా ఈ కృషిలో భాగస్వాములు కావాలి అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.