ట్రైలర్‌తోనే నెలకొన్న వివాదం..!

SMTV Desk 2018-12-28 15:42:06  Manmohan Singh, The Accidental Prime MinisterPre release, youth congress

ముంబై, డిసెంబర్ 28: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌పై రూపొందుతున్న చిత్రం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌' వివాదాస్పదమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదల అయ్యింది. ఈ చిత్ర ట్రైలర్‌ చుసిన కాంగ్రెస్ నాయకులు సినిమా విడుదలకు ముందు తమకు ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సినిమాపై మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు ముందు తమకు ప్రీ రిలీజ్‌ షో వేయాలని, లేకుంటే చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించింది.

విజయ్ రత్నాకర్ గుట్టె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌ టైటిల్‌ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో వాస్తవాలు వక్రీకరించి రూపొందించిన అభ్యంతరకర సన్నివేశాలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్ర యూత్‌ విభాగం చిత్ర రూపకర్తలకు రాసిన లేఖలో వ్యక్తం చేసింది. చిత్రంలో ఎలాంటి అవాస్తవ సన్నివేశాలు చొప్పించలేదని వెల్లడించేందుకు తమకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

ట్రైలర్‌ను పరిశీలిస్తే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ అధినేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీలకు సంబంధించి దుష్ప్రచారం చేసేలా సినిమా ఉంటుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. తమ కార్యవర్గ సభ్యులకు ముందస్తుగా సినిమాను ప్రదర్శించి, తాము సూచించే మార్పులను చేపట్టకుంటే దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని ఆ ప్రకటనలో యూత్‌ కాంగ్రెస్‌ చిత్రబృందాన్ని హెచ్చరించింది.