ఈవెంట్ సంస్థలకు వాణిజ్య పన్నుల శాఖ నిబంధనలు..!!

SMTV Desk 2018-12-28 13:48:31  New year celebration, Event organaisation company, Income tax, TGST, CGST

హైదరాబాద్, డిసెంబర్ 28: నగరంలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ఈవెంట్ సంస్థలకు రాష్ర వాణిజ్య పన్నుల శాఖ కొత్త నియమాలను పాటించాల్సిందిగా పేర్కొంది. 2019 నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే ఈవెంట్‌ సంస్థలు టీజీఎస్టీ, సీజీఎస్టీ చట్టం పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని రాష్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ పేర్కొన్నారు. ఈ చట్టం పరిధిలో నమోదు చేయించుకున్న సంస్థలు టీజీఎస్టీ, సీజీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం విడుదల చేసిన ప్రకటనలో నూతన సంవత్సరం సందర్భంగా వినోద కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు ముందుగా తమ సంస్థ టర్నోవర్‌ ప్రకారం 28 శాతం పన్నును చెల్లించాలని సూచించారు. వినోదపు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందే ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుందనీ, దీనిని ఉల్లంఘించిన వారిపై 100 శాతం జరిమానా రూపంలో వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన ఏవైన సందేహాలు, వివరాల కోసం నాంపల్లిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల కార్యాలయం లేదా టోల్‌ ఫ్రీ నం.18004253787ను సంప్రదించాలని కోరారు. రాష్ట్ర వినోదపు పన్ను చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామనీ, దీని దృష్యా వినోదపు కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.