ఔషధ మొక్కలకు సబ్సిడీ అందజేయనున్న రాష్ట్ర ప్రభుత్వం..!!

SMTV Desk 2018-12-28 13:37:02  Aloevera processing plants, C Pardhasaaradhi, State government subsidy, Natural medicines,agriculture,former

హైదరాబాద్, డిసెంబర్ 28: గురువారం నగరంలో రాజేంద్రనగర్‌లోని ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కల పరిశోధనా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అలోవీర ప్రాసెసింగ్‌ ప్లాంటు, వాటి భవనాలను వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి పార్థసారధి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఔషధ మొక్కల సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోందని, బై బ్లాక్‌ వొప్పందంలో రైతులు ఔషధ మొక్కల సాగు చేసి అధిక లాభాలను పొందవచ్చన్నారు. ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కల వాణిజ్య సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తోందని తెలిపారు. అలోవీర ప్రాసెసింగ్‌ ప్లాంటు ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు తాము పండించిన వాటిని ఇక్కడ ప్రాసెసింగ్‌ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

అంతేకాక అలోవీర, ఇతర ఔషధ మొక్కల పెంపకంలో మెళుకువలను ఇక్కడి పరిశోధనా కేంద్రంలోని నిపుణులు అందిస్తారని వివరించారు. మొక్కల పెంపకంపై యువ రైతులకు రెండు నుండి 8 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన యువత సొంతంగా ప్రాసెసింగ్‌ ప్లాంట్లను పెట్టుకునేందుకు ప్రభుత్వ సంస్థలు సైతం ఆర్థిక సహాయాన్ని చేస్తాయని వెల్లడించారు. ఔషధ మొక్కల పరిశోధనా స్థానం జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రంగా కూడా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్‌ భగవాన్‌, డీన్‌ డాక్టర్‌ ఎం విజయ, రిజిష్ట్రార్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, కంప్ట్రోలర్‌ డాక్టర్‌ కిరణ్‌, డాక్టర్‌ ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.