రైలు భోజనంలో బల్లి

SMTV Desk 2017-07-27 15:45:30  train, food, santosh kumar sing alahabad, veg biryani

న్యూఢిల్లీ, జూలై 27 : రైళ్లల్లో శుచీ శుభ్రత లేకుండా భోజనం తయారవుతోందడానికి ఈ ఘటనే నిదర్శనం. మంగళవారం హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ ప్రయాణికుడికి ఇచ్చిన వెజిటబుల్‌ బిర్యానీలో చచ్చిన బల్లి పడి ఉన్న సంఘటనలో సదరు రైల్వే కేటరర్‌ ఒప్పందాన్ని అధికారులు బుధవారం రద్దు చేశారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాది సంతోష్‌ కుమార్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు ఆర్డరు చేసి తెప్పించుకున్న బిర్యానీ తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రయాణికులు ఆ బల్లి బిర్యానీని ఫొటోతీసి భారతీయ రైల్వే శాఖకు, రైల్వే మంత్రికి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రైల్వేశాఖ ఆ ప్రయాణికునికి వరుసగా మూడు స్టేషన్లలో వైద్య పరీక్షలు చేయించింది. ఆర్కే అసోసియేట్స్ అనే సదరు రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టు సంస్థపై తక్షణం వేటు వేసింది. ఆ సంస్థపై జరిమానా విధించడంతోపాటు కాంట్రాక్టును రద్దు చేసింది. భోజన పదార్థాల్లో నాణ్యతా రాహిత్యాన్ని, అధిక రేట్ల వసూలును ఏమాత్రం సహించేది లేదని రైల్వే మంత్రిత్వశాఖ ప్రతినిధి ఏకే సక్సేనా తెలిపారు. అస్వస్థతకు గురైన ఆ ప్రయాణికుడు పట్నా తర్వాత వచ్చే యూపీలోని ముగల్‌సరాయ్‌లో చికిత్స చేయించుకున్నారు.