ఎన్నికల వేళా రైతులకు తాయిలాలు ప్రకటించనున్న కేంద్రం...!!

SMTV Desk 2018-12-28 13:03:22  Central Govt, BJP govt, Narendra Modi, Agriculture Department, Crisis agriculture, Farmers Debt Waiver

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైతులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాగా, రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పాటు వ్యవసాయ రంగం సంక్షోభంపై ప్రతిపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వం తీవ్ర వొత్తిడి ఎదుర్కొంటోంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని బీజేపీ నేతలు, ఎంపీలు, వివిధ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రైతులకు భారీ ఆర్థిక ప్యాకేజీపాటు పలు ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.


కాగా, రైతు సమస్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ ప్రధాని మోదీకి ఇప్పటికే వివరించింది. ఇందులో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కారాలను చూపింది. ఇంకా ఏడు రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు, తెలంగాణలో రైతు బంధు పథకం, వొడిశాలో ఇన్‌పుట్‌ సబ్సిడీతో సహా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వంటివి ఇందులో ఉన్నాయి. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలపై రాబోయే ఎన్నికల లోపే ప్రభుత్వం వొక ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.