రాజకీయ ప్రయోజనాల కోసమే హై కోర్ట్ విభజన...???

SMTV Desk 2018-12-28 11:25:22  Telangana, Andhrapradesh, High court, Central governament, High court judge, Radhakrishnan, Praveen kumar

హైదరాబాద్‌,డిసెంబర్ 28: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హై కోర్టు విభజనకు ఈ మధ్యే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ విభజనకు కేంద్రం నాంది పలికింది. అయితే ఈ విభజనపై ఏపీ న్యాయవాదులు తీవ్రంగా మండిపడ్డారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు హాలులో నిరసన తెలిపారు. లాయర్ల ఆందోళన, నిరసనలతో హైకోర్టు ప్రాంగణం మార్మోగింది. రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడీగా విభజన చేశారని ఆరోపించారు. దీంతో హైకోర్టులో హైటెన్షన్‌ ప్రారంభమైంది. ఎటువంటి సౌకర్యాలు లేకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం సమంజసం కాదని గురువారం హైకోర్టు వద్ద ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన లాయర్లు ఆందోళనలు, నిరసనలు తెలిపారు. దీంతో హైకోర్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కేసు విచారణ నిమిత్తం బెంచ్‌కి వచ్చిన ఉమ్మడి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ దిగి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు.

ఈనేపథ్యంలో గురువారం విచారణకు రావాల్సిన షబ్బీర్‌ ఆలీ, మల్‌రెడ్గి రంగారెడ్డి పిటీషన్లపై విచారణ వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన లాయర్లు కలిసి తమ సమస్యలను గూర్చి విన్నపించుకున్నారు. అమరావతిలో భవన సదుపాయాలు ఏమీ లేకుండా ఎలా వెళ్లాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయం ఇవ్వకుండా కేసుల విభజన, సిబ్బంది కేటాయింపులు చేయకుండా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అక్కడ సరైన సౌకర్యాలు లేవని, కనీసం టాయిలెట్స్‌ కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీల రూమ్స్‌ ఏమీ లేకుండానే కేవలం ఉన్నట్లుగా, అన్ని వసతులూ ఏర్పాటు చేసినట్లుగా అఫిడవిట్‌లో త్రిశంఖు స్వర్గం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌ తప్పుల తడకగా ఉందని విమర్శించారు. జనవరి 1వ తేదీ నాటికి తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు అఫిడవిట్‌ సమర్పించిన కారణంగానే ఈ సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో కడుతున్న తాత్కాలిక హైకోర్టు భవనాలకు ఇప్పటి వరకూ వెళ్లడానికి దారి కూడా లేదని సీనియర్‌ న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు తయారు కావడానికి 6 నెలల సమయం పడుతుందని అన్నారు. ఏపీ న్యాయవాదుల తరలింపు కటాఫ్‌ తేదీని పొడిగించాలని డిమాండ్‌ చేశారు. కేవలం నాలుగు రోజుల్లో హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ విజయవాడ ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. అలాగే ట్రాన్స్‌ఫర్‌ పిటీషన్ల పరిస్థితి ఏమిటని అన్నారు. అనతరం హైకోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆదోళన చేసి కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో హైకోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా హైకోర్టు విభజన నోటిఫికేషన్‌పై తెలంగాణ న్యాయవాదులు స్వాగతించారు. స్వీట్లు పంచుకుని వొకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు.