ఫిబ్రవరిలో ముగియనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర...??

SMTV Desk 2018-12-27 17:41:18  YSRCP, YS Jaganmohan reddy, Prajasankalpa yatra, Oppostition leader, TDP, Janasena party, Congress party

అమరావతి, డిసెంబర్ 27: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రని వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన ముగించాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ యాత్ర ఫిబ్రవరి 9 కంటె ముందే ముగుస్తుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబర్ మాసంలో కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఇవాల్టికి యాత్ర ప్రారంభించి 331 రోజులు అవుతోంది. ఇప్పటికే జగన్ 3500 కి.మీలకు పైగా పాదయాత్రను కొనసాగించారు. యాత్ర పూర్తయ్యేసరికి నాలుగు వేల కిలోమీటర్లు దాటే అవకాశం లేకపోలేదు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల ద్వారా యాత్ర కొనసాగుతోంది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ యాత్ర కొనసాగుతోంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారం నాటికి శ్రీకాకుళం జిల్లాలో కూడ యాత్రను పూర్తి చేయాలని వైసీపీ చీఫ్ జగన్ భావిస్తున్నారు. ఏపీలో ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో యాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జగన్ తలపెట్టారు. పాదయాత్ర పూర్తయ్యేనాటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాదయాత్రను ఫిబ్రవరి 9వ తేదీకి పూర్తి చేయడానికి ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. వాతావరణం సహకరించకపోయినా ఇతరత్రా కారణాలతో వొకటి రెండు రోజులు పాదయాత్ర ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటే ఉండొచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.అన్నీ అనుకొన్నట్టుగా సాగితే ఫిబ్రవరి 9వ తేదీ నాటికి యాత్రను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

పాదయాత్ర పూర్తి కాగానే జగన్ ఎన్నికల వ్యవహరాల్లో బిజీగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఏపీ రష్ట్రంలో పాదయాత్ర నిర్వహించిన వారంతా కూడ ముఖ్యమంత్రులయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.జగన్ పాదయాత్ర ఏపీ రాష్ట్రంలో వైఎస్‌ జగన్ సీఎం అయ్యేందుకు దోహదపడనుందా లేదా అనే విషయాన్ని మరో నాలుగు మాసాల్లో తేలనుంది. జగన్ సీఎం అయితే పాదయాత్ర నిర్వహిస్తే సీఎం అవుతారనే సెంటిమెంట్‌కు మరింత బలం చేకూరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.