గర్జన దీక్షలో బాబుపై ఘాటుగా స్పందించిన పృధ్వీ

SMTV Desk 2018-12-27 17:18:09  AP, CM, Chandrababu, YSRCP, YS Jaganmohan reddy, New delhi, jantar mantar, Garjana dheksha, Prudhvi

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 27: ఢిల్లీలో జంతర మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న సినీ నటుడు పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడిగారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాక చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో అనైతికంగా చంద్రబాబు నాయుడు పొత్తుపెట్టుకున్నారంటూ పృధ్వి విరుచుకుపడ్డారు. ఆ అనైతిక పొత్తును ప్రజలు తిరస్కరించారని రాబోయే రోజుల్లో తరిమేస్తారంటూ ధ్వజమెత్తారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును ప్రజలు ఓటుతో చీకొట్టారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి మెుదలు పెట్టి కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు ఎంత ప్రచారం చేసినా ఏం జరిగిందో ప్రజలు చూశారంటూ విమర్శించారు. ఫిరాయింపులపై తెలంగాణలో నీతులు మాట్లాడిన చంద్రబాబు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఏంటని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి, మాటపై నిలకడలేని వ్యక్తి, అనైతిక పొత్తులకు ఆద్యుడు చంద్రబాబు నాయుడేనంటూ దుమ్మెత్తిపోశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా విరుచుకుపడ్డారు. సంక్రాంతి పండుగకు హరిదాసుల్లా వచ్చిన వ్యక్తులు తమను ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అటు మాజీసీఎం కిరణ్ కుమార్ రెడ్డిపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తెలియదన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏం తెలుసు అని ప్రశ్నించారు. గోల్కొండ కోటలో గోల్ప్ ఆడుకోవడం మాత్రమే వచ్చన్నారు. ఆఖరి బంతి ఆఖరి బంతి అని పదేపదే చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి కనుమరుగు అయిపోయాడంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. రాబోయేది రాజన్న రాజ్యం అని చెప్పుకొచ్చారు.