ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే టీఆర్‌ఎస్‌ గెలుపు : అద్దంకి దయాకర్

SMTV Desk 2018-12-27 15:31:29  Addanki dayakar, Congress leader, Telangana election commission, Press meeting, Indira shobhan, TRS, Congress party, KCR, KTR, Lie detecter

హైదరాబాద్, డిసెంబర్ 27: బుధవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్ తో కలిసి మీడియాతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదనీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో కలెక్టర్లతో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలలో పాల్గొనలేక పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం పూర్తిగా పనిచేయడం లేదనీ, యధా రాజా తథా ప్రజాగా పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. గెలిచిన ఎమ్మెల్యేల్లల్లో సంతోషం లేకపోగా, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు నిరాశలో కూరుకుపోయారనీ, నియోజకవర్గాలలో ఆ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ ఎలా గెలిచిందో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే టీఆర్‌ఎస్‌ గెలిచిందని తాము మొదటి నుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. ఇది నిజమని తాము ఆధారాలు చూపుతామని అంటే టీఆర్‌ఎస్‌ ముందుకు రాలేదనీ, దీనిపై కేటీఆర్‌కు లై డిటెక్టర్‌ పరిశీలనకు రమ్మడి అడిగితే వెనకడుగు వేశారని వ్యాఖ్యానించారు. లై డిటెక్టర్‌ పరీక్షకు రాని పక్షంలో మౌనం అంగీకార సూచనమని తమ పార్టీ ఆనాడే స్పష్టం చేసిందనీ, ఇది నిజమైందని పేర్కొన్నారు.

తెలంగాణతో పాటు ఎన్నికైన మిగతా 4 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటై మంత్రులు ప్రమాణస్వీకారం కూడా చేశారనీ, ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో పరిపాలనను గాలికి వదిలేసి గుళ్లూ, గోపురాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారనీ, తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గెలిపించింది ఇందుకేనా ? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ట్యాంపరింగ్‌ రాబందుల సమితిగా మారిపోయిందనీ, కేసీఆర్‌ ఢిల్లీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తిరుగుతుంటే కేటీఆర్‌ దుబాయిలో విలాసాలు అనుభవిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని విమర్శించారు.

అనంతరం పార్టీ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన అక్ర్రమాలలో ప్రథమ ముద్దాయి ఎలక్షన్‌ కమిషనేనని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని గాలికి వదిలేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని ఆరోపించారు. రైతు బంధుకు రూ. 500 కోట్లు చెల్లించలేని దుస్తితిలో ప్రభుత్వం ఉందనీ, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గత ఐదారు నెలలుగా వేతనాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని అధికారానికి దూరం చేసే కుట్ర చేస్తున్నదని ఈ సందర్భంగా దయాకర్‌ విమర్శించారు.