రాష్ట్రపతి రక్షణగా ఆ మూడు కులాల వారేనా?

SMTV Desk 2018-12-26 19:31:32  President of India, security guard, Recruitment, Delhi High Court

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశ రాష్ట్రపతి అంగరక్షకుల (సెక్యూరిటీ సిబ్బంది) నియామక ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ వివాదంగా మారింది. రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది నియామకం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అందులో సిక్కు, రాజ్‌పుత్‌, జాట్‌ కులాల వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని, వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీనిపై హర్యానాకు చెందిన గౌరవ్‌ యాదవ్‌ అనే యువకుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బుధవారం దీనిపై విచారించిన ఢిల్లీ ధర్మాసనం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్‌ను ఆదేశించింది. దేశాధ్యక్షుడుకి సంబంధించిన సిబ్బందిని కులాల వారిగా నియమించడం ఏంటని పిటిషన్‌దారుడు వ్యాజ్యంలో పేర్కొన్నారు. అంగరక్షకుడిగా తాను అన్ని విధాలా అర్హుడినని, తాను యాదవ కులానికి చెందిన వాడినని తన దరఖాస్తును తిరస్కరించారని గౌరవ్‌ తెలిపారు. రాష్ట్రపతి అంగరక్షకులుగా కేవలం జాట్‌, సిక్కు, రాజ్‌పుత్‌లనే నియమించడం ఏంటని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది రామ్‌ నరేష్‌ యాదవ్‌ ధర్మాసనం ముందు వాదించారు.