త్వరలోనే కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలుస్తా: అఖిలేష్‌ యాదవ్

SMTV Desk 2018-12-26 17:03:30  K Chandrashekar Rao, Akhilesh Yadav, Uttar Pradesh

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ మధ్య బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. దీనిపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ జనవరి 7 తరువాత సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లోనే కలుస్తానన్నారు. కొన్ని కారణాల వల్ల డిసెంబర్‌ 25, 26 తేదిల్లో ఆయనను కలవాల్సి ఉన్నా కలవలేకపోయానని అన్నారు. కొన్ని రోజులుగా అన్ని పార్టీలు కలిసి పని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నం చేయడం అభినందనీయం అన్నారు. ఫెడరల్‌ ఫ్రెండ్‌ దిశగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, ఆయనను కలిసిఆ విషయంపై మరింత చర్చిస్తానని అఖిలేష్‌ పేర్కొన్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం వివిధ రాజకీయ పార్టీల నేతలతో కేసీఆర్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవల వొడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్‌ను కలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పలు కారణాల వల్ల తాను ఢిల్లీ వెళ్లలేకపోతున్నానని, త్వరలోనే కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలుస్తానని అఖిలేష్‌ వెల్లడించారు.