అయ్యో రామా.. నన్ను ఎవరు గుర్తుంచుకుంటారంటున్న దేవెగౌడ..!

SMTV Desk 2018-12-26 11:06:28  Bogibel, Road cum rail bridge, Deve Gowda, assam, Narendra Modi

బెంగళూరు, డిసెంబర్ 26: రెండు దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేసిన దేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెన బోగీబీల్‌ సుమారు 21 సంవత్సరాల తరువాత ప్రారంభం అయ్యింది. ఈ వంతెన నిర్మాణానికి 1997లొ అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవేగౌడ శంకుస్థాపన చేశారు. కాగా 2002లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ఈ వంతెనను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. తొలుత ఈ వంతెనని రూ.3,200 కోట్ల బడ్జెట్‌తో 4.31 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని భావించారు. కానీ తరువాత దీన్ని 4.94 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ఫలితంగా బడ్జెట్‌ రూ.5,900 కోట్లకు చేరింది. దీనిపై స్పందించిన దేవెగౌడ, "ఢిల్లీ మెట్రో, కాశ్మీర్ కు రైల్వే లైన్, బోగీబీల్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ లను నేను ప్రధానిగా ఉన్నప్పుడే మంజూరు చేశాను. ప్రజలు నన్నిప్పుడు మరచిపోయారు" అని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "అయ్యో రామా..! నన్ను ఎవరు గుర్తుంచుకుంటారు. కొన్ని దినపత్రికలు మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించాయి. ఈ ప్రాజెక్టు చాలా ఆలస్యం కావడం అసంతృప్తిని కలిగించింది. ఘటప్రభా నదిపై అనగ్ వాడీ బ్రిడ్జ్ ని, హనన్ - మైసూరు ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేశాను. ఉత్తర కర్ణాటకకు నేనేమీ చేయలేదని కొందరు బాంబే కర్ణాటక ప్రాంత నేతలు అంటుంటారు. వెళ్లి చూసి ఆపై మాట్లాడండి" అని ఆయన అన్నారు.