సంక్షేమం, సాధికారికతపై మూడో శ్వేతపత్రం విడుదల

SMTV Desk 2018-12-25 16:21:05  AP,CM, Chandrababu, Amaravati

అమరావతి, డిసెంబర్ 25: ఆదివారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై శ్వేత పత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న సుపరిపాలనపై రెండో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అయితే తాజాగా సంక్షేమం, సాధికారికతపై మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ బాధల్లో ఉండే వ్యక్తికి ఉపశమనం కావాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరని బాబు అన్నారు.

సామాజిక, చారిత్రక, భౌగోళిక కారణాల వల్ల ఎంతో మంది పేదరికంతో, ఆర్ధిక అసమానతలతో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణల ద్వారా వచ్చే ఫలితాలను సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్ధిక అసమానతలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన కష్టాలతో పాటు పాదయాత్ర అనుభవాల ద్వారా స్వయంగా పేదవారి కష్టాలు, రైతుల ఇబ్బందులు తెలుసుకున్నానని అవన్నీ తనను ఎంతగానో కలిచివేశాయని సీఎం తెలిపారు. ఈ అనుభవాల దృష్ట్యా సరికొత్త సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు.

‘‘కుటుంబంలో నలుగురు అన్నం తిని, ఇద్దరు తినకపోతే తిననివారు బాధపడుతూనే ఉంటారు. కానీ అన్నం తిన్నవారు కూడా స్థిమితంగా ఉండలేరు, తినని వారి కోసం ఆక్రోశం, తిన్నవారిని కదిలించి వేస్తుంది, ఆవేశానికి గురిచేస్తుందని అంబేద్కర్ చెప్పిన మాటలను చంద్రబాబు గుర్తు చేశారు.ఆర్ధిక అసమానతలు ఉన్నంత వరకు కొంతమంది ఆకలితో బాధపడుతూ ఉంటే, బాగా తిన్న వారికి కూడా ఆ తృప్తి ఉండదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిందని తెలిపారు.పేదరికాన్ని నిర్మూలించాలని, పేదలను ఆదుకోవాలని చాలా మంది చెబుతూ ఉంటారని కానీ సంపద సృష్టించబడకపోతే పేదరిక నిర్మూలన సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సంపద సృష్టించకుండా పేదరికాన్ని నిర్మూలిస్తామని నినాదాలిచ్చినా, ఆందోళనలు చేసినా ఇంకా పేదరికం పెరుగుతుంది కానీ తగ్గదని ఆయన అన్నారు.ప్రకృతి వనరులు, మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సంపద సృష్టించబడాలి.. దానిని పేదలకు సమానంగా పంపిణీ చేయడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తిరిగి పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. అసమానతల నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.