నగరంలో లేడీ కిలాడీలు అరెస్ట్ 45 తులాల బంగారం స్వాధీనం

SMTV Desk 2018-12-25 13:56:45  Hyderabad city, Railway stations, Bus station, Women thefts, Arrest, Gold

హైదరాబాద్, డిసెంబర్ 25: నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చోరికి పాల్పడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో గత కొంతకాలంగా వరుస బ్యాగు చోరీలు జరుగుతున్నాయి. దీనిపై ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం 1వ నెంబర్ ఫ్లాట్‌ ఫాలోని బుకింగ్ ఎంట్రన్స్ వద్ద ప్రయాణికుల బ్యాగుల చోరీకి పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.





వీరిని కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతికి చెందిన బోయ దుర్గమ్మ, బర్రె శారద, జ్యోతి, బడిగ భాగ్యలుగా గుర్తించారు. హైదరాబాద్‌లోని టెక్స్‌టైల్స్ కంపెనీలో పనిచేస్తోన్న వీరు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.14.50 లక్షల విలువైన 45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అలాగే ప్రయాణ ప్రాంగణాల్లో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తినుబండారాలు ఇస్తే తీసుకోవద్దని రైల్వే ఎస్పీ తెలిపారు.