మంత్రాలు చేసిందని కన్నతల్లి గొంతు నలిమాడు

SMTV Desk 2018-12-25 13:18:18  Black magic, Mother, Son, Karimnagar, Rajanna siricilla, Srinivas

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 25: తనపై చేతబడి చేస్తుందన్న అనుమానంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన‌పల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన నర్సయ్య, చంద్రవ్వ దంపతులకు కుమారుడు శ్రీనివాస్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కుమారునికి వివాహమై కరీంనగర్ జిల్లా గంగాధరలో నివాసముంటున్నాడు. జీవనోపాధి కోసం గల్ఫ్‌‌కు వెళ్లి అక్కడ అనారోగ్యం కారణంగా అర్నెల్ల క్రితం స్వదేశానికి తిరిగొచ్చాడు. అయితే తల్లి మంత్రాలు వేయడం వల్లనే తాను అనారోగ్యానికి గురవుతున్నట్లు అనుమానిస్తూ వచ్చిన శ్రీనివాస్ ఇటీవల తన ఇంట్లో విరుగుడు పూజలు కూడా చేయించాడు.

ఎన్ని పూజలు చేయించినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి పలు రకాల పరీక్షలు చేయించుకున్నాడు. వైద్యులు కూడా శరీరంలో ఏ లోపం లేదని అంతా బాగానే ఉందని నివేదిక ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ అనుమానం మరింత బలపడింది ఇదంతా తల్లి మంత్రాల వల్లనేనని నమ్మాడు.

ఆదివారం రాత్రి వొంటరిగా ఉన్న తల్లిని గొంతు నులిమి చంపేశాడు. అయితే నేరం తనపై రాకుండా ఉండేందుకు ‘‘బల్లపై నుంచి కింద పడి అమ్మ చనిపోయిందంటూ తండ్రి నరసయ్యకు సమాచారమిచ్చాడు. అయితే తన కొడుకుపై అనుమానం కలగడంతో శ్రీనివాస్ ను నరసయ్య నిజం చెప్పమని విలపించాడు. తర్వాత తానె స్వయంగా వొప్పుకున్నాడు. నరసయ్య ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.