ఆధార్ కోసం వేల కోట్లల్లో ఖర్చు

SMTV Desk 2017-07-27 12:27:20  aadhar, 9 cots, central government, UIDAI it minister pp chowdari

న్యూఢిల్లీ, జూలై 27 : పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ళ నుంచి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొరకు రూ.9,055.73 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి లోక్‌సభకు బుధవారం సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో యూఐడీఏఐ 2009-10 నుంచి 2017 జూలై 18 వరకు రూ.9,055.73 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీనిలో రూ.3,819.97 కోట్లు ఆధార్ నమోదు కోసం, రూ.1,171.45 కోట్లు ఆధార్ కార్డుల ముద్రణ, ఆధార్ లేఖలను ప్రజలకు పంపించడం కోసం ఖర్చయినట్లు వివరించారు. 2017 జూలై 21 వరకు 116.09 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలు జారీ అయ్యాయని, 115.15 కోట్ల మందికి ఆధార్ కార్డులను పంపించామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతా దగ్గర నుంచి మొబైల్‌ సిమ్‌ కార్డు తీసుకునేంత వరకు అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.