రథయాత్రపై సుప్రీంకు వెళ్లిన భాజపాకి చుక్కెదురు..!

SMTV Desk 2018-12-24 17:22:47  BJP, West Bengal, Rath yatra, Supreme court of India

కోల్‌కతా, డిసెంబర్ 24: బీజేపీ పశ్చిమబెంగాల్ లో చేపట్టాలనుకుంటున్న రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీకి చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై అసలు విచారణ అవసరం లేదని, సాధారణ కేసుల్లాగానే దీన్ని కూడా పరిగణిస్తున్నామని చెప్పి పిటిషన్ ను కొట్టివేసింది.

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రథయాత్రను చేపట్టాలనుకున్నారు. శాంతిభద్రతల కారణంగా అనుమతిని ఇవ్వలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కలకత్తా కోర్టును బీజేపీ ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఈ తీర్పును డివిజన్ బెంచ్ పక్కన పెట్టేసింది. దీంతో, బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమస్యలు సృష్టిస్తుందన్న అనుమానంతో తృణమూల్ కాంగ్రెస్‌ భాజపా రథయాత్రను అడ్డుకుంటుదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజవర్గాల్లో ప్రచారం నిర్వహించాలన్న భాజపా ప్రణాళికకు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో అడ్డంకి ఏర్పడింది.