పోలవరం ప్రాజెక్ట్ గేట్ల ప్రారంభ సభలో పాల్గొన్న చంద్రబాబు

SMTV Desk 2018-12-24 12:21:36  AP, CM, Chandrababu, Polavaram project, Spill way crust gate

ప.గో.జి, డిసెంబర్ 24: ఉదయం పోలవరం ప్రాజెక్టులోని కీలకమైన స్పిల్ వే క్రస్టు గేట్లు బిగించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు గారు ప్రారంభించారు. 40, 41 స్తంభాల మధ్య తొలి క్రస్ట్ గేట్ వద్ద పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేడియల్ గేట్‌ స్థాపన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాగునీటి చరిత్రలో కీలక ఘట్టం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వందేళ్ల పోలవరం ప్రాజెక్ట్ కలను సాకారం చేసే దిశగా అడుగులేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

వొకప్పుడు రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నీరు లేక ఎడారిగా ఉండేదని అలాంటి పరిస్థితి నుంచి తాను ఎంతో మార్పు తీసుకువచ్చినట్లు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో గ్రావిటీ ద్వారా నీటిని శ్రీశైలంలో నింపి అక్కడ నుంచి హాంద్రినీవా ద్వారా అనంతపురం జిల్లాకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎడారి ప్రాంతం నుంచి సశ్యామలం చేశానని ఫలితంగా ఎంతో సంతోషం చెందుతున్నట్లు తెలిపారు.
కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో సహాయ నిరాకరణ చేసిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రూ.24వేల కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు.

మే నెలలో రెండు కాలువలను ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వొక కాలువ ద్వారా నీటిని విశాఖ జిల్లా వరకు, మరో కాలువ ద్వారా కృష్ణా జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కరువు అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఈ ప్రదేశాన్ని వొక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం కాకపోతే పోలవరం ప్రాజెక్టు సాకారమయ్యేది కాదన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం చాలా ఆందోళన చెందానని లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటా అన్న ఆందోళన చెందామని ఆనాడే ఏపీని అభివృద్ధే తన లక్ష్యంగా ప్రతినబూనినట్లు తెలిపారు. తనకు ముంపు మండలాలను ఏపీలో విలీనం చెయ్యకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనని ప్రధాని నరేంద్రమోదీకి తేల్చి చెప్పానని తన పట్టుదలతో ఆ ఏడు మండలాలలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో అతివేగంగా పూర్తైన ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు ఉండాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తైన ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు.

తాను సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరుగెత్తించానని మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్న ఘనత తనకే దక్కుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టకు సంబంధించి 63 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని 2019లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమన్న వారికి సమాధానం చెప్పేలా పోలవరం ప్రాజెక్టును నిర్మించి త్వరలోనే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.