పార్టీ మారుతున్న నేతల ఇంటిముందు శవయాత్ర చెయ్యాలి : పొన్నం

SMTV Desk 2018-12-23 18:02:01  Congress party, Ponnam prabhakar, Party working presidant, Karimnagar constiuency

హైదరాబాద్, డిసెంబర్ 23: కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటి చేసి పరాజయపాలైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఈ రోజు తమ పార్టీ మారుతున్న నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేతల ఇంటి ముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చేస్తామని హెచ్చరించారు. అటు కార్యకర్తలకు సైతం పిలుపునిచ్చారు. పార్టీ మారిన వాళ్ల ఇంటిముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చెయ్యాలంటూ పిలుపునిచ్చారు. ఓటమితో తాము కృంగిపోవడం లేదని ఓటమికి కారణాలేంటో విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కేసీఆర్ పైనా పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. కొత్తగా ఎణ్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చెయించకుండా కేసీఆర్ ఫ్రెంట్ కోసం తిరుగుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మంత్రి వర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో సమర్థులు లేరా అంటూ నిలదీశారు.

శాసనమండలి సభ్యులను టీఆర్ఎస్ లో విలీనం చెయ్యడం సరికాదన్నారు. అటు రాఫెల్‌ కుంభకోణంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే విభజన హామీలపై పోరాడుతున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు నటిస్తున్నారని విమర్శించారు. రాఫెల్‌ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రూ.526 కోట్లకు వచ్చే విమానాలను రూ.1600 కోట్లకు ఎందుకు కొన్నారో తెలపాలని పొన్నం డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ తయారికి హెచ్‌ఎఎల్‌లాంటి నవరత్న కంపెనీని కాదని ఎలాంటి అనుభవంలేని రిలయన్స్‌ కు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.రాఫెల్‌ విషయంలో కేం‍ద్రం సుప్రీంకోర్టును తప్పదోవ పట్టించింది. రాఫెల్‌ వొప్పందంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇక దుకాణం మూసుకోవాల్సిందేనన్నారు.