సార్వతిక ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ

SMTV Desk 2018-12-23 13:10:38  YSRCP, Assembly elections, India today south conclave, India today consulting editor, Rajdeep sardheshay, Ummareddy, Special status, Ramesh, BJP

విశాఖపట్నం, డిసెంబర్ 23: నగరంలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌లో సభలో వైసీపీ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయం ఎవరిది అనే అంశంపై ఇండియాటుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఉమ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ పార్టీ బయట నుంచి మద్దతిస్తుందని తెలిపారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విజయం ఎవరిది అనే అంశంపై జరిగిన డిబేట్ లో పాల్గొన్న సీఎం రమేష్ ఏపీలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయలా? లేదా అనే అంశంపై ఇంకా చర్చించలేదన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను దారుణంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు.