కలాం స్మారక మండపాన్ని ప్రారంభించనున్న మోదీ

SMTV Desk 2017-07-27 10:59:27  modi, chennai, abdhulkalam, flag, opening

చెన్నై, జూలై 27 : భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు రామేశ్వరంలో అబ్దుల్‌ కలాం స్మారక మండపాన్ని ప్రారంభించనున్నారు. రామనాధపురం జిల్లా రామేశ్వరం సమీపంలోని తంగచ్చిమఠం ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధి ఉన్న తరుణంలో అక్కడి కేంద్ర ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థంగా స్మారక మండపాన్ని నిర్మించింది. ఈ మండపంలో దాదాపు 700ల కలాం ఛాయాచిత్రాలు, ఆయన సేవలపై గీసిన చిత్ర లేఖనాలు వంటివి ఏర్పాటు చేశారు. కలాం రెండో వర్ధంతి సందర్భంగా గురువారం ఈ స్మారక మండపాన్ని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11.20 గంటలకు మోదీ ఇక్కడకు చేరుకుని తొలుత జాతీయ జెండాను ఎగురవేస్తారని, అనంతరం స్మారక మండపం ప్రారంభోత్సవం ఉంటుందని అధికారులు వివరించారు. తర్వాత రామేశ్వరం నుంచి ఢిల్లీ వరకు వెళ్లే ‘అబ్దుల్‌ కలాం - 2020’ అనే ప్రచార వాహనాన్ని ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. ఉదయం 11.55 గంటలకు స్మారక మండపం సమీపంలోని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ క్వార్టర్స్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మోదీ చేరుకుని, రామేశ్వరం- అయోధ్య మధ్య కొత్త రైలు సేవను ప్రారంభిస్తారని సమాచారం. ఈ మేరకు ప్రధాని మోదీకి గవర్నర్, సీఎం స్వాగతం పలకనున్నారు.