ఆంధ్రాలో కేసిఆర్

SMTV Desk 2018-12-21 19:27:31  Andhrapradesh, Telangana, KCR, Chandrababu naidu

అమరావతి, డిసెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేకర్ రావు ఏపీ సీఎం బాబుకి ‘రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 23న చంద్రబాబు కంచుకోట విశాఖపట్నంలో అడుగుపెట్టబోతున్నారు. డిసెంబరు 23వ తేదీ ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో సతీసమేతంగా బయలుదేరి విశాఖకు చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని శారదాపీఠంలోని స్వరూపానందస్వామివారిని దర్శించుకొని అక్కడ కొలువైన రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

తరువాత విశాఖ నుంచి విమానంలో భువనేశ్వర్ బయలుదేరుతారు. అదేరోజు సాయంత్రం వొడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమయ్యి జాతీయకూటమి ఏర్పాటు గురించి చర్చిస్తారు. మర్నాడు అంటే సోమవారం ఉదయం కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి కోణార్క్, పూరీ దేవాలయాలను సందర్శిస్తారు. మళ్ళీ భువనేశ్వర్ చేరుకొని ప్రత్యేక విమానంలో నేరుగా కోల్‌కతాకు బయలుదేరుతారు. సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించుకొన్నాక మళ్ళీ రాత్రి డిల్లీ బయలుదేరివెళతారు.

డిసెంబరు 25 నుంచి మూడు రోజులపాటు డిల్లీలోనే బస చేస్తారు. కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినవారు డిల్లీ వచ్చి ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ కనుక ప్రదాని మోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఆ తరువాత తెరాస ఎంపీలతో కలిసి పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై చర్చిస్తారు. ఆ మూడు రోజుల పర్యటనలో బిఎస్పి అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సిఎం కేసీఆర్‌ వరుసగా సమావేశమవుతారు.