బాబుని గిన్నీస్ బుక్‌లోకి ఎక్కించాలి : లక్ష్మీపార్వతి

SMTV Desk 2018-12-21 13:59:23  Chandrababu naidu, Nandamuri laxmiparvati, Ramgopal varma, Lakshmis NTR, Gunnis book

హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికర వాఖ్యాలు చేశారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించిన వ్యక్తి.. ఇప్పుడు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ గుర్తువచ్చారు. ఆయన పేరు పెట్టిన వొక్క పథకం అయినా సక్రమంగా అమలు జరుగుతుందా. విడతల వారీగా ఎన్టీఆర్ పేరుని నాశనం చేస్తూ… వారి కుటుంబ సభ్యులను వాడుకుంటున్నారు అంటూ విమర్శించారు. నిత్యం అబద్దాలు చెప్తున్న చంద్రబాబు పేరు గిన్నిస్ బుక్‌లో ఎక్కించాలి అని ఓ లెటర్ రాయాలి అనుకుంటున్నా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘చంద్రబాబుకి అధికారం, డబ్బు రెండూ ఉంటే చాలు. హరికృష్ణ చనిపోయే ముందు కూడా చాలా బాధపడ్డారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆయనకు దూరంగా ఉంటున్నారు.

ఇంట్లో ఉన్న సుహాసినిని తీసుకొచ్చి ఎన్నికల బరిలో దింపారు. ఆమెను బలిపశువును చేశారు. కూకట్ పల్లి ఎన్నికల్లో ఓటమి అనంతరం సుహాసిని చేసిన ట్వీట్ చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ గురించి నేను రాసిన ఎదురులేని మనిషి పుస్తకం ఆధారంగా రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు అంటూ అమె వివరించారు. తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో తరిమేశారన్నారు. ఏపీకి పట్టిన పీడ ఎప్పుడు విరగడ అవుతుందో అన్నారు.