200 మీటర్లు పోలీసును ఈడ్చుకెళ్లిన మందుబాబు..!

SMTV Desk 2018-12-20 11:52:12  Traffic Police, Drunk and Drive Case

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: న్యూఢిల్లీ లో తప్పతాగిన ఓ మందుబాబు, తన వాహనాన్ని ఆపేందుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసును 200 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. న్యూఢిల్లీ గురుగ్రామ్ సమీపంలోని సిగ్నేచర్ టవర్ చౌక్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. తప్పతాగి రాంగ్ రూట్ లో వస్తున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసు ఆపగా, సదరు వాహనదారుడు ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు.

కాగా ఆ కారు ఆపటానికి ముందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ పైకి వాహనాన్ని ఎక్కించాలని చూశాడు. సదరు కానిస్టేబుల్ కారు బాయినెట్ ను గట్టిగా పట్టుకోగా, కారును దౌడు తీయించాడు. దాదాపుగా 200 మీటర్ల దూరం కారు వెళ్లింది. ఈలోగా మరో వాహనదారుడు ఆ కారుకు అడ్డుగా తన కారును తీసుకెళ్లడంతో మందుబాబు దొరికిపోయాడు. అతన్ని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.