యోగి ఆదిత్యనాథ్ రాజీనామాకు మాజీ ఐపీఎస్ ల డిమాండ్

SMTV Desk 2018-12-19 20:09:10  Yogi adhithyanag, Uttarpradesh CM, BJP, Former IPS, IAS, IFS

ఉత్తరప్రదేశ్, డిసెంబర్ 19: రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజేపి అధ్యక్షుడు యోగి ఆదిత్యనాథ్ పై పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని 80 మందికి పైగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు డిమాండ్ చేశారు. వారిలో మాజీ జాతీయ భద్రతా సలాహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శులు శ్యాంశరణ్, సుజాతాసింగ్ వంటి పెద్దలున్నారు. బులంద్‌షహర్ అల్లర్లలో పోలీసు అధికారి సుబోధ్‌కుమార్‌సింగ్‌ను దారుణంగా చంపేసిన ఘటన ఇటీవలి కాలంలో విద్వేష రాజకీయాలు ఎంత ప్రమాదకరమైన మలుపు తిరిగాయో సూచిస్తున్నాయని వారు ఘాటుగా రాసిన ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

యూపీలో పరిపాలనా మౌలిక సూత్రాలు, రాజ్యాంగ నైతికత, మానవీయమైన సామాజికవర్తన వక్రమార్గం పట్టాయని దుయ్యబట్టారు. మతద్వేషపు ఎజెండాకు సీఎం ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారని, రౌడీయిజం, గూండాయిజం గద్దెనెక్కాయని మండిపడ్డారు. పోలీసు అధికారి సుబోధ్‌కుమార్‌సింగ్ హత్య మెజారిటీవాద కండబలం ప్రదర్శనకు జరిగిన ప్రయత్నమని, ఆ ప్రాంతపు ముస్లింలకు ఓ సందేశమని మాజీసీనియర్ అధికారులు తమ లేఖలో ఎండగట్టారు. ఎన్నికల సభల్లో తెగమాట్లాడే మన ప్రధాని నరేంద్రమోదీ ఇలాంటి ఘటనలపై రాయిలా మౌనం వహిస్తున్నారని విమర్శలు సంధించారు. మన ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి ఇంతగా విద్వేష విషం ఎన్నడూ చొచ్చుకుపోలేదని, ఉన్నతస్థానాల్లో ఉన్నవారి అండదండలతో పథకం ప్రకారం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.