కేసీఆర్ మంత్రివర్గంపై తనయుడి ముద్ర.!

SMTV Desk 2018-12-19 13:20:08  KCR, KTR, Hareesh Rao, Cabinet

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంపై ఆయన తనయుడు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముద్ర పడే అవకాశాలున్నాయి. కేటీఆర్ కు అనుకూలంగా ఉండే విధంగా మంత్రివర్గ కూర్పు ఉంటుందని భావిస్తున్నారు. కేటీఆర్ కు సన్నిహితులైన వారికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా సీనియర్లను లోకసభ స్థానాలకు పోటీ చేయించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావును కూడా లోకసభకు పోటీ చేయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో తనకు తోడునీడగా ఉండేందుకు హరీష్ రావును లోకసభకు పోటీ చేయిస్తారనే ప్రచారం సాగుతోంది.

కేటీఆర్, హరీష్ రావులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడమే కుటుంబ పాలన అనే విమర్శల నుంచి బయటపడడానికి మంచిదని కేసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం ముఖ్యమంత్రితో సహా 18కి మించకూడదు. ఇప్పటికే మహమూద్ అలీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, కాగా మరో 16 మందికి క్యాబినెట్ లో అవకాశం ఉంటుంది. తొలి విడతలో ఎనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం.