కాంగ్రెస్ గూటిని వీడిన మరో సీనియర్ నేత

SMTV Desk 2018-12-18 14:17:09  Congress party, Sajjan kumar, Senior leader, Resigning

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: కాంగ్రెస్ గూటిని వీడుతూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసిన మరో సీనియర్ నేత సజ్జన్‌ కుమార్‌ (73) . తనను దోషిగా తేలుస్తూ దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని సజ్జన్‌ లేఖలో పేర్కొన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. సిక్కుల ఊచకోత ఘటనలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి.. సజ్జన్ కుమార్ ను దోషిగా ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ లోపు లొంగిపోవాలని సజ్జన్‌ కుమార్‌ ను కోర్ట్ ఆదేశించింది.

1984లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత రోజు దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. అందులో భాగంగా ఢిల్లీలో వొకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న సజ్జన్‌ కుమార్‌ సహా అప్పటి కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ బల్వన్‌ ఖోఖార్‌, రిటైర్డ్‌ నేవీ అధికారి కెప్టెన్‌ భగ్మల్‌, గిర్‌ధారీ లాల్‌పై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులో సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. 2013లో దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును బాధితులు, సీబీఐ సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు సజ్జన్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.