ఉత్కంఠ భరితంగా మారుతున్న సూరి హత్య కేసు : తుది తీర్పు

SMTV Desk 2018-12-18 13:04:50  Gangula surya narayana reddy, Nampally high court

హైదరాబాద్, డిసెంబర్ 18: నగరంలో సంచలనం రేపుతున్న ఫ్యాక్షనిస్ట్ గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ రోజు తుది తీర్పు ఇవ్వనుంది. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2011, జనవరి 3న హైదరాబాద్ యూసఫ్‌గూడలో సూరి కారులో ప్రయాణిస్తుండగా అతడి అనుచరుడు భాను కిరణ్ కాల్చి చంపాడు. 2012లో భానుకిరణ్‌ని జహీరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. భానుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సూరి హత్య సమయంలో కారులో భాను, డ్రైవర్ మధు ఉన్నారు. సూరిని భాను చంపినట్టు మధు వాంగ్మూలం ఇచ్చాడు. ఏడేళ్ల పాటు సీఐడీ విచారణ సాగింది.

ఈ కేసులో ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టులో విచారణ జరిగింది. కాల్చి చంపింది భాను కిరణేనని సూరి కారు డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం, ప్రధాన నిందితుడి నుంచి సేకరించిన తుపాకీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు, ఈ హత్యకు సంబంధించి భానుకిరణ్‌కి మిగిలిన నిందితులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్టు సమాచారం. సూరి హత్య కేసులో ఆరుగురి పేర్లను పోలీసులు ఛార్జిషీట్‌లో చేర్చారు. 92మంది సాక్షులను విచారించారు. ఆయుధాల అక్రమ రవాణా కేసులో భాను కిరణ్‌తో పాటు మరో ముగ్గురికి హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన విషయం విదితమే. సూరి హత్య కేసులో భాను, మన్మోహన్ సింగ్, సుబ్బయ్య, లోకనాథ్, వెంకటరమణ, హరిబాబులు నిందితులుగా ఉన్నారు.