తీరాన్ని తాకినా పెథాయ్..!

SMTV Desk 2018-12-17 15:11:41  Pethai Cyclone, Chandrababu Nayudu, Home Minister China Rajappa

అమరావతి, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని వణికిస్తోన్న పెథాయ్‌ తుపాను తీరాన్ని చేరింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు సమాచారం అందించారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఏడు జిల్లాలపై ప్రభావం చూపిస్తోందని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను ప్రభావం వల్ల పలు రైళ్లు, విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. ఇప్పటికే విశాఖకు రావాల్సిన 14 విమానాలను,పలు రైళ్ళను రద్దు చేశారు. విమానాశ్రయంలో 200లకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తుపాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలకు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీనిపై ఏపీ హోంమంత్రి చిన్న రాజప్ప మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పునరావాస కేంద్రాల్లో ఆహార పదార్ధాల, మంచి నీటి కొరత లేకుండా చూస్తున్నాం. తుపాను తీరం దాటిన తరువాత, ఆ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందన్నారు.