కోహ్లిసేన విజయ లక్ష్యం 287

SMTV Desk 2018-12-17 13:07:42  Team india, australia, testmatch, perth

పెర్త్, డిసెంబర్ 17: పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేనకు నిర్దేశించింది.

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు. దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్‌కి కష్టంగా మారడం విశేషం. నాలుగో రోజైన సోమవారం ఆటలో భాగంగా ఆస్ట్రేలియా లంచ్‌ వరకూ కాస్త మెరుగ్గానే ఆడినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్‌ శర్మ వికెట్‌ తీశాడు. 132/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు ఉస్మాన్‌ ఖాజా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌లు నెమ్మదిగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.