రాఫేల్ ఒప్పందంపై కచ్చితంగా జేపీసీ వేయాల్సిందే

SMTV Desk 2018-12-15 17:44:14  Rahul Gandhi, rafale deal, modi

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు . రాఫేల్ డీల్ పై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఈ దేశ చౌకీదార్ పెద్ద దొంగ అని ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ అనీల్ అంబానీ స్నేహితుడని, రాఫేల్ పేరుతో సంపదను తన స్నేహితుడు అంబానీకి దోచిపెట్టారని ఆరోపించారు. రాఫేల్ డీల్ పై కాగ్ ఇచ్చిన నివేదిక పీఏసీ ముందుకే రాలేదని, అసలు ఆ నివేదిక ఎక్కడుందని ప్రశ్నించారు. రాఫేల్ ధర వివరాలు కాగ్ ద్వారా ఇప్పటికే పీఏసీకి అందాయని సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పిందని, అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. పీఏసీ ఛైర్మన్ మల్లిఖార్జున్ ఖర్గేకి తెలియకుండా నివేదిక ఎలా ఉంటుందని, ఖర్గే లేకుండా వేరే పీఏసీ ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. రాఫేల్ వొప్పందంపై కచ్చితంగా జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు.