మీడియా సంస్థలు దారుణంగా ప్రవర్తించాయన్న కేటీఆర్..!

SMTV Desk 2018-12-15 16:15:00  KTR, TRS, Telangana Elections, Meet The Press

హైదరాబాద్, డిసెంబర్ 15: కంప్యూటర్లను, సెల్ ఫోన్లను తానే తీసుకొచ్చానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంకా చాలా పనులను తానే చేసినట్లు ఆయన క్రెడిట్ తీసుకుంటూ ఉంటారనీ, దాన్ని చంద్రబాబుకే వదిలివేస్తున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ హేమాహేమీ నేతలు రంగంలోకి దిగినా, ప్రజలు మాత్రం కేసీఆర్ పై విశ్వాసం ఉంచారని వెల్లడించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

చంద్రబాబు ప్రజలు లేని ప్రజా కూటమిని తెలంగాణపై వదిలారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి కాంగ్రెస్ నేతలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని మీడియా సంస్థలు దారుణంగా ప్రవర్తించాయని కేటీఆర్ విమర్శించారు. జాతీయస్థాయిలో వాస్తవ పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటే.. కొన్ని మీడియా సంస్థలు మాత్రం మహాకూటమి విజయం సాధించేసింది, తెరాస ఘోరంగా ఓడిపోబోతోంది అంటూ భారీ స్థాయిలో ప్రచారం చేసాయి. ఇలాంటి వార్తలతో తమకు నష్టం ఏమీ లేదనీ, ఆయా సంస్థలే తమ విశ్వసనీయతను కోల్పోయాయన్నారు. తనకు మీడియా మిత్రులంటే చాలా గౌరవం ఉందన్నారు.